శ్రీ పద్మనాభస్వామి

 శ్రీ పద్మనాభస్వామి దేవాలయం

              పద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలవాడు అని అర్థం. శ్రీ పద్మనాభస్వామి దేవాలయం శ్రీ మహా విష్ణువు ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని తిరువనంత పురంలో ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం ట్రావెం కోర్ (travancore) రాజ కుటుంబం ధర్మకర్తల నిర్వహణలో నడుస్తుంది.

చరిత్ర :-        

               ట్రావెన్ కోర్ రాజ కుటుంబం చేర వంశానికి చెందిన వారు. అలాగే కుల శేఖర సన్యాసి ఆళ్వార్ సంతతి వారు. ఈ ఆలయం శ్రీ మహా విష్ణువు యొక్క 108 దివ్య దేశములలో ఒకటి. 108 దివ్య దేశములు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాలు ఉన్న దివ్య క్షేత్రాలు అని అర్థం. శ్రీ మత్భాగవతంలో బలరామ దేవుడు తన తీర్థ యాత్రలో భాగంగా ఫాల్గుణ (ప్రస్తుత శ్రీ పద్మనాభస్వామి దేవాలయం) అనే ఈ దేవాలయాన్ని దర్శించి నట్లు, ఇక్కడ ఉన్న పంచప్సరసులో (పద్మ తీర్థం లో) స్నానం చేసినట్లు అలాగే పది వేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది. తమిళ ఆళ్వారులు రచించిన దివ్య ప్రభందం లో కూడా ఈ ఆలయం ప్రస్తుతించారు. (6వ శతబ్దము - 9వ శతాబ్దం) క్రీ.శ 16వ శతాబ్దం అంతా ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అప్పుడు ఈ ఆలయం ప్రసిద్ధ తిరువట్రార్ శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ఈ ఆలయం కారణంగా కేరళ రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. "తిరు అనంత పురం" అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని యొక్క పవిత్ర ఆలయం అని అర్థం. ఈ నగరానికి అనంత పురం, శయనంతపురం అనే మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభ స్వరూపమే. హిందూ ధర్మం భగవంతుడి రూపం సచ్చిదానందం అని చెప్తుంది.( సంపూర్ణ సత్యం, సంపూర్ణ జాగృతి, సంపూర్ణ ఆనందం) ఆలయ గర్భ గృహంలో ప్రధాన దైవమైన పద్మనాభ స్వామి అనంత శయన భాంగిమలో ( అనంత శేషుడి తల్పం మీద యోగ నిద్ర) ఉంటాడు. ట్రావణ్ కోర్ మహా రాజు తనకు తానే పద్మనాభ దాసుడను అని నామ కరణం చేసుకున్నాడు. ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం అన్న ప్రకటన ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేకమైన వస్త్ర ధారణ చేయాలన్న నియమం కూడా ఉంది.

ఆలయ నిర్మాణం :-

              పద్మ నాభుడి ఆలయం అత్యంత పురాతనమైనది. సుమారు 5 వేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. అత్యంత పురాతన మైన ఈ దేవాలయం విట్టల్ పిల్లమార్ అనే ఏనిమిది కుటుంబాల హయాంలో నడుస్తూ వస్తుంది. కాల గమనంలో ఈ ఆలయం ట్రావెన్ కోర్ సంస్థాన స్తాపకుడైన మార్తాండ వర్మ చేతిలోకి వచ్చింది. వారు తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని ఆలయంలోని శంఖాన్ని తమ రాజ్యానికి గుర్తుగా పెట్టుకున్నారు. 1729 సంవత్సరంలో పునరుద్ధరించారు.
           శ్రీ పద్మనాభ స్వామి ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 7000 వేల మంది తాపీ పనివారు, 5000 వేల మంది శిల్ప కళ నిపుణులు, 800 ఏనుగులు ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించారని అప్పటి శాసనంలో పొందుపరిచారు. స్వామి వారి ఆలయ విస్తీర్ణం సుమారు ఏడు ఎకరాల వరకు ఉంటుంది. అంతే కాకుండా ప్రత్యేకమైన టేకుతో బంగారు కవచం తో తయారు చేయబడిన దేవాలయ ధ్వజ స్తంభం ఎత్తు సుమారు వంద అడుగుల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న గోపురాన్ని మాత్రం 1566 వ సంవత్సరంలో నిర్మించారు. ఆలయ మూల విరాట్ను 1208 సాల గ్రామాలతో తయారు చేశారు. ఈ భారీ విగ్రహాన్ని చూడటానికి మూడు ద్వారాల గుండా చూడాలి. ఆది శేషుని పై పవలించినట్లున్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తలభాగాం, మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు అందులో పుట్టిన తామర పువ్వు, మూడో ద్వారం ద్వార చూస్తే పాద భాగం కనిపిస్తాయి. మిగతా భాగాలు మొత్తం పూర్తిగా బంగారముతో  చేయబడినవి, స్వామి కిరీటం, చేవులకున్న కుండలాలు ఛాతీని అలంకరించిన భారీ సాల గ్రామాల మాల, శివుడి విగ్రహానికి ఉన్న కంకణం, కమలం తీగ వరకు, స్వామి పాదాలు కూడా అంతా బంగారముతో చేయబడినవి. ముస్లిం రాజుల దండయాత్రలో విగ్రహం ధ్వంసం కాకుండా కాపాడుకోవడం కోసం, విగ్రహానికి హాని కలగకుండా ఆయుర్వేద మిశ్రమాలు వాడినట్లు ఇక్కడివారు చెబుతుంటారు.
              అంతే కాకుండా ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. పద్మనాభ స్వామి ఆలయం ముందున్న ద్వారం నుండి చూస్తే సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ద్వారంలో ఉన్న రంధ్రాల నుండి సూర్యుడు స్పష్టంగా కనిపిస్తాడు. అంతేకాకుండా సూర్యుడు అస్తమించడం దేవాలయ ద్వారం నుండి చూపడం మధురమైన అనుభూతిని కలిగిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మాటల్లో వర్ణించలేని విధంగా ఆ దృశ్యం మన కళ్ళకు కనిపిస్తుంది.

స్థల పురాణం :-

         పద్మనాభ స్వామి స్థల పురాణం గురించి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతూ ఉంటారు. అందులో ఒక స్థల పురాణం గురించి మనం తెలుసుకుందాం. పద్మనాభ స్వామి దేవాలయం ఎంతో విశిష్టత కలిగినది. దివాకర అనే ముని శ్రీ కృష్ణ భగవానుడి దర్శనం కోసం తపస్సు చేస్తుండగా మునిని కనికరించడానికి శ్రీ కృష్ణ భగవానుడు మారు రూపంలో ఒక పిల్ల వాడిగా ముని వద్దకు వచ్చాడు. ముని పూజలో ఉండగా ఆ బాలుడు ఒక సాలగ్రామాన్ని తీసుకొని మింగడం తో ముని పిల్లవాడిని వెల్లిపోమన్ని ఆగ్రహిస్తాడు. 
              అప్పుడు పిల్లవాడు సమీపంలోని ఒక చెట్టు వెనకకు వెళ్లి దాక్కొని వుంటాడు. ఆ సమయంలో ఆ చెట్టు విరిగి కింద పడి శ్రీ మహా విష్ణువు విగ్రహంగా మారిపోతుంది. అంతేకాకుండా స్వామి వారు శయన భంగిమతో అనంత శయన యోగ నిద్ర మూర్తి తరహాలో కనిపిస్తాడు. స్వామి వారి భారీ ఆకారాన్ని చూసి పూర్తిగా తనివి తీర దర్శించుకొలేక  పోతున్నానని దివాకర ముని చింతిస్తాడు. దాంతో స్వామి వారిని దివాకర ముని వేడుకుంటాడు.
           స్వామి మీ భారీ ఆకారాన్ని నేను తనివితీరా చూడలేక పోతున్నాను... దయచేసి మీ ఆకారంలో మూడో వంతుకు తగ్గండి అని ప్రాధేయ పడతాడు. ముని విన్నపాన్ని ఆలకించిన శ్రీ మహా విష్ణువు తన భారీ ఆకారాన్ని మూడో వంతుకు తగ్గిస్తాడు. అయితే నన్ను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు నన్ను మూడు ద్వారాల గుండా దర్శించుకోవాలని మునితో అంటాడు. ఇప్పుడు  ఆ మూడు ద్వారాలు రావడానికి అదే కారణమని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. అంతే కాకుండ స్కంద, పద్మ పురాణాల్లో ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి విశేషాలు ఉన్నాయి. 

 అనంత సంపద :-

            ఇప్పటి వరకు ప్రపంచం లోనే అత్యంత సంపన్నమైన తిరుపతి తిరుమల వడ్డీ కాసుల వాడు.... ఈ మధ్య కాలంలో కేరళ తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి వారి దేవాలయంలో బయల్పడిన అనంత సంపదతో వజ్రాలు, వైడుర్యాలు, టన్నుల కొద్దీ బంగారు ఆభరణాలు మొదలగు వాటితో లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపదతో మొదటి స్థానం లో నిలబడగా రెండో స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడు రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఇంకా బయట పడవలసిన సంపద ఉన్నందున పూర్తి స్థాయిలో సంపద నంతటిని లెక్క కట్టాల్సి ఉంది. ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద నేల మూళిగలలో దాచి ఉన్నదని తెలుసు. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని తెరిచి చూసిన పాపాన పోలేదు. 1860 లో మూసివేసిన కొన్ని గదులను మాత్రం 1950 లో సీల్ వేశారు. స్వాతంత్ర్యానంతరం స్థానిక ఆలయాలన్నింటిని ట్రావేన్ కోర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసినా ఈ ఆలయాన్ని మాత్రం రాజ కుటుంబీకులు తమ పర్యవేక్షణ క్రిందనే ఉంచుకున్నారు. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిర్ తిరునాళ్ బలరామ వర్మను అప్పటి ప్రభుత్వం రాజ ప్రముఖుడు గా ప్రకటించింది. ఆ రాజ కుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ట్రస్తిలుగా కొనసాగారు. ప్రస్తుతం ఎనభై తొమ్మిది సంవత్సారాల వయసున్న ఉత్తరదామే తిరునాళ్ మార్తాండ ట్రస్తిగా కొనసాగుతున్నారు. ఈ ఆలయ సంపద నిర్వహణ అస్త వ్యస్తంగా ఉన్నదని దాన్ని గాడిలో పెట్టాలని టి.పి సుందర రాజన్ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో దావా వేయగా, సుప్రీం కోర్టు ఒక కమిటీని వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది. ఆ విధంగా ఆ నేల ముళిగలలోని  అనంత సంపదను వెలుగు చూసింది. ఇప్పటి వరకు ఐదు నేల మాళిగలలోని సంపదను మాత్రమే లెక్కించారు. అందులోని అనంతమైన సంపద బయట పడింది. ఇంకా ఆరో గది తెరవ వలసి ఉంది. దాని నిర్మాణ రీత్యా అది చాలా పెద్దది. అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి ఉంచబడి ఉన్నదని తెలుస్తూంది. ఇప్పటివరకు బయట పడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు బయల్పడిన సంపదలో బంగారం , వజ్రాభరణాలు, బంగారు దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చ రాళ్ళు పొదిగిన నగలు, బస్తాల కొద్ది బంగారం, వెండి నాణేలు, దాదాపు రెండు వేల రకాల కంటాభరణాలు గొలుసులు బయల్పడ్డాయి. పదహారవ శతాబ్దం నాటి శ్రీ కృష్ణ దేవరాయలు కాలం నాటి నాణేలు, ఈస్టిండియా కాలం నాటి నాణేలు, నెపోలియన్ చొనపర్టే కాలం నాటివి బస్తాల లభ్యమయ్యాయి. అంతే గాక చిత్ర విచిత్రమైన వస్తువులు ఉన్నాయి. ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూశాయి. ఇంత సంపద బయల్పడిన ఇంకా అతి పెద్దది అతి ముఖ్యమైనది అయిన ఆరో గది తెరవాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

గౌతమి పుత్ర శాతకర్ణి

రెడ్డి రాజులు