అలెగ్జాండ్రోవిచ్
అలెగ్జాండ్రోవిచ్
ఆ ఒక్కడే లేకపోతే మూడో ప్రపంచయుద్ధమే...!
ఒక్కోసారి దూకుడుగా తీసుకునే నిర్ణయాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరించాలని చెబుతారు. ఓ స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పుడు నిర్ణయం తీసుకుంటే ప్రపంచ భవిష్యత్తు అగమ్యగోచరం అయ్యే ప్రమాదముందని అనడానికి రెండో ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన ఓ ఘటనే ఉదాహరణ.....!
రెండో ప్రపంచ యుద్ధం మొదట్లో అమెరికా తటస్థంగా ఉండి పోయింది. కానీ చివర్లో ఇంగ్లాండ్, సోవియట్ యూనియన్... తదితర దేశాలతో కలిసి అక్షకూటమి పై పోరాడింది. 1945 లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత సోవియట్ యూనియన్, అమెరికాల మధ్య దూరం పెరిగింది. ఈ రెండు దేశాల మధ్య ప్రచన్న యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో అమెరికా సమీపంలో వున్న క్యుభా పై పట్టు సాధించాలని రెండు అగ్రరాజ్యాలు ప్రయత్నిస్తూ వుండేవి. అయితే క్యూబా కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉండేది.
అది 1962 అక్టోబర్ 27... సోవియట్ యూనియన్ కు చెందిన బి - 29 జలాంతర్గామి క్యుబాకు సమీపంలోకి వెళ్ళింది. అందులో సీనియర్ ఆఫీసర్ గా # అలెగ్జాండ్రోవిచ్ - అర్కిపొవ్ విధులు నిర్వహిస్తున్నారు. జలాంతర్గామి క్యూబా కు సమీపంలోకి వచ్చిందన్న విషయం అమెరికా సేనలకు తెలిసింది. దానిని నీటి తరంగాల ఒత్తిడికి గురి చేసి ఉపరితలం పైకి తెప్పించేందుకు డెప్త్ చార్జర్లు ( హైడ్రాలిక్ షాక్ సృష్టించేవి ) వేసి బెదిరించడం మొదలుపెట్టారు. అయితే... అందులో ఉన్న అలెగ్జాండ్రోవిచ్ ఆర్కిపొవ్, మరో సీనియర్ అధికారి వెలింటిన్ సావింట్ స్కై జలాంతర్గామి కెప్టెన్ ముగ్గురు అప్రమత్తమయ్యారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా ఎదురుదాడికి దిగొచ్చని సోవియట్ ప్రభుత్వం ముందస్తు ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు అధికారులు ఎదురుదాడికి సిద్దమైపోయారు. మూడో ప్రపంచయుద్ధం తమతోనే మొదలవుతుందని భావించారు. కానీ వాళ్ళలో సమాన హోదాలో ఉన్న అలెగ్జాండ్రోవిచ్ - అర్కిపొవ్ మాత్రం ఇందుకు నిరాకరించారు. ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం కుదరనిదే ఆపరేషన్ లో ముందుకెళ్లడం సాధ్యంకాదు. దీంతో జలాంతర్గామి కెప్టెన్ వెనక్కి తగ్గాడు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఆర్కిపోవ్ ఎంతో ఉన్నతంగా ఆలోచించాడు. ఒకవేళ ఆ రోజు అమెరికా సేనలపై ఎదురుదాడి జరిగితే ప్రపంచ పరిణామాలు మారిపోయేవి. ఎందుకంటే అందులో పది కిలోటన్నుల విస్పోటం సృష్టించే న్యూక్లియర్ టార్పెడో వుంది. ఒక్క బటన్ నొక్కితే చాలు అది అమెరికా సేనలు ఉన్నచోట సముద్రంలో సునామీ సృష్టస్తోంది. దాని రేడియేషన్ ప్రభావం భవిష్యత్ తరతరాల వారిపైన పడుతుంది. అమెరికా వెంటనే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీంతో మూడవ ప్రపంచ యుద్ధం అనివార్యమే. అయితే ఆ జలాంతర్గామి లో న్యూక్లియర్ టార్పెడో ఉందన్న విషయం అమెరికా సేనలకు అప్పటికి తెలియదు. తర్వాత తెలుసుకొని ఖంగుతిన్నాయి.
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ను ప్రపంచ భవిష్యత్తు కోసం అలోచించి ఉన్నత నిర్ణయం తీసుకున్న అర్కిపోవ్ వయస్సు అప్పుడెంతో తెలుసా... కేవలం 34 సంవత్సరాలు. ఆ వయస్సు లో చాలామంది దూకుడు గా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల మూడో ప్రపంచ యుద్దమే ఆగిందని తెలిసిన వారు చెబుతుంటారు. ఆర్కిపోవ్ 72 ఏళ్ల వయస్సు లో 1998లో మరణించాడు. ఆయన సేవలను అభినందిస్తూ అమెరికాకు చెందిన సంస్థ 2017 లో " ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ " అవార్డ్ తో సత్కరించారు. అప్పటికే ఆయన మరణించడంతో అర్కిపోవ్ మనవడు సర్జెయ్ కు 50 వేల డాలర్లు నగదును అందించారు.
Comments
Post a Comment